
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
Website Designed & Maintained by Srinivas Pendyala www.facebook.com/madhuravanimagazine
కథా మధురాలు
ఆప్యాయతకి అర్థం

శానాపతి(ఏడిద) ప్రసన్నలక్ష్మి
అమ్మ చనిపోయి సంవత్సరం కావొస్తుంది...!
ఇండియా నుంచి అన్నయ్య ఇప్పటివరకూ పదిసార్లైనా ఫోన్ చేసి ఉంటాడు. ఐదు నిమిషాల క్రితం కూడా మాట్లాడాడు.
"వచ్చే నెలాఖరు లోనే అమ్మ సంవత్సరీకం. ఈసారైనా నువ్వు వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది.ఈ విషయం బావగారికి, పిల్లలకి కూడా నేను చెప్పానని చెప్పు. కనీసం ఇరవై రోజుల ముందుగా అయినా రావడానికి ప్రయత్నించండి." ఎంతో ఆప్యాయత గా మరీ మరీ చెప్పి ఫోన్ పెట్టాడు.
అన్నయ్య ఎప్పుడూలేనిది ఎంత ప్రేమగా పిలిచాడు..?? అంతలా అడుగుతుంటే రానని ఎలా చెప్పగలను ? అమ్మలేని ఇల్లు పుట్టిల్లే కాదని మనసు ఎంత రొద చేస్తున్నా ...సర్దిచెప్పుకున్నాను.
నాకంటూ ఇంకెవరున్నారని ?అమ్మానాన్నా లేనంత మాత్రాన్న పుట్టిల్లు పరాయిదనుకోవడమేనా? ఉన్న ఒక్క అన్నయ్యతోనూ బంధం తెంచుకుంటే ఎలా?పుట్టింటి ఆడపడుచుగా ఆ ఇంటికి నేనెప్పుడూ యువరాణినే.మనసులోని ద్వేషాన్ని పక్కనపెట్టి ప్రేమను నింపుకున్నాను.
తోడబుట్టిన మేమిద్దరం ఒకప్పుడు ఎంత ఐక్యతగా వుండేవాళ్ళం? బడికెళ్లినా,ఆటలకెళ్లినా కలిసే వెళ్ళేవాళ్ళం.గాంధీనగర్ పార్కులో ...దొంగాట నుంచి బంతాట వరకు వాడి స్నేహితులతోనే అన్ని ఆటలూ. నా సైన్స్ పుస్తకాల్లో బొమ్మలు రాక అవస్థ పడుతుంటే... తానే అందంగా గీసి ఇచ్చేవాడు.
కాలం తెలీకుండా పెద్దవాళ్ళమైపోయాం.గౌనుల నుంచి పరికిణీలకి, ఆ తర్వాత ఓణీలకు ఎదుగుతూ వచ్చాను.ఇంట్లో ఆంక్షలు మొదలయ్యాయి. ఒంటరిగా ఆడది గడప దాటకూడదని.బయటకు వెళ్తే ఎవరైనా తోడుతో వెళ్లాల్సిందే.కాలేజీకి వెళ్లగలిగానంటే మా ఇంటిపక్కనే నాతోపాటూ చదివే నేస్తాలు ఉండబట్టే.
అన్నయ్య నాకంటే రెండేళ్లు పెద్దవాడేమో..తన తోటివారితో స్నేహాలువేరు. కాలేజీ, ఫ్రెండ్సూ, సినిమాలు,షికార్లు, క్రికెట్లు ఇవే వాడి లోకం.
నా లోకం నాది. కాలేజీకి వెళ్తూ తీరిక సమయాల్లో పత్రికలు చదవడం వల్లనేమో...రచనకు కావాల్సిన శైలిని వంటబట్టుకున్నాను. మా వీధిలోనే ఒకమ్మాయి ఒకబ్బాయికి రాఖీ కట్టిందని ..అదేదో పెద్ద తప్పు చేసినట్లు ఆ ఇంట్లో చాలా గోల చేశారు.ఆ అవమానం తట్టుకోలేక ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే అడ్డుకున్నారు.పెళ్లి కాకుండా ఇలాంటి పనులు చేస్తే కడుపో కాలో వచ్చి పోయిందంటారని కయ్యిమన్నారు. పుండుమీద రోకలిపోటంటే అప్పుడర్థమైంది నాకు.నేనూ అదే వయసులో ఉండటం వల్లనేమో...నాలో పౌరుషం తన్నుకొచ్చింది. అప్పుడే మొదటిసారిగా కలం పట్టాను."నిజం తెలియకుండా కన్నెపిల్ల ఆత్మహత్యలపై కథలల్లకండి" అంటూ ఒక వ్యాసాన్ని రాసి ఒక పత్రికకు పంపాను. అది అచ్చవ్వడంతో ...అన్నయ్య నాకు మంచి మంచి థీమ్స్ చెప్పి ప్రోత్సహిస్తూ చాలా కథలు రాయించాడు.నేనూ ఒక రచయిత్రిగా వివిధ పత్రికల్లో చోటు సంపాదించాను.
ఆడపిల్లకు ఇరవై ఏళ్లు వచ్చాయంటే గుండెలమీద కుంపటనుకునే రోజులవి.అమ్మానాన్న నా పెళ్లి చేసేసి భారాన్ని దించుకున్నారు.
భర్తతో పాటూ ఆనందంగా అడుగుపెట్టాను అత్తవారింట.సంసార బాధ్యతల్లో ఇద్దరు పిల్లలూ ఎప్పుడు పెద్దవాళ్ళయ్యారో ...చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడే ఉద్యోగాలు సంపాదించేసుకున్నారు. పిల్లలు కూడా దగ్గర లేకపోవడంతో ...ఏమీ తోచక మళ్ళీ కలానికి దగ్గరయ్యాను. మొదట్లో ఏ అనుభవమూ లేక ఊహిస్తూ రాసే కథలు కొన్నైతే...జనజీవనం లోంచి పుట్టిన యధార్థాలను వస్తువుగా తీసుకుని కథలు రాయడం జరిగేది.పెళ్లయ్యాక..కథలు రాయాలనే ఉత్సాహం,ఓపిక అన్నీ పోయాయి.కారణం అన్నయ్య దగ్గర లేకపోవడమే కావొచ్చు.అప్పుడప్పుడు ఏవో కొన్ని రాయగలిగాను ఎలాగో.కానీ ఇప్పుడు వయసు మీద పడ్డంతో...నాకే చాలా అనుభవాలు ఎదురయ్యాయి. వాటిమీదే కథలు రాస్తున్నా!
పిల్లలిద్దరూ తమదగ్గరకు వచ్చేయమని గొడవ చేస్తున్నారు.సరే కదాని ఇద్దరిదగ్గరకూ వెళ్ళడానికే నిశ్చయించుకుని ముందుగా ఆస్ట్రేలియా లోని పెద్దోడి దగ్గరకు వెళ్లి అటునుంచి అటు అమెరికా లోని చిన్నోడు దగ్గరకి వెళ్లాలని నా ప్లాను.
ఇంకా ఇరవై రోజుల్లో ఆస్ట్రేలియా వెళ్తాననగా...అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి ఆదరా బాదరా గా పుట్టింటికి పరుగెత్తా.అప్పటికే అమ్మ హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఉంది. హై బీపీ రావడంతో మెదడులోని రక్తనాళాలు ఏవో పూడుకుపోయాయి అంట.సమయానుసారంగా డాక్టర్ చెకప్ చేయించక పోవడం వల్లే అంతవరకూ వచ్చిందంట. నాలుగు రోజులు అయోమయ స్థితిలో వున్నా..బానే బ్రతికి బయట పడిందనుకున్నాం.ఐసీయూ నుంచి రూమ్ కి మార్చాక వారం రోజుల తర్వాత డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాము.అమ్మ దగ్గర అయిదు రోజులు ఉండి నేనే అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. త్వరగా కోలుకోవాలని ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉండేదాన్ని.ఆ మాటల్లో ...అన్నయ్య దగ్గర తను అనుభవిస్తున్న బ్రతుకుభారం అంతా ఏదో గుర్తుకొస్తున్నట్లు చెప్తూ కళ్ల నీళ్లు పెట్టుకోవడమే ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంటుంది. నాకు ఆస్ట్రేలియా ప్రయాణం దగ్గర పడటం తో...అక్కడ నుంచి బయలుదేరుతూ అన్నయ్యతోనూ,వదిన తోనూ అమ్మని బాగా చూసుకోమని చెప్పాను.నా మాటకు అహం దెబ్బతిందో ఏమో..? నీకంత ప్రేమ ఉన్నదానివైతే నువ్వే తీసుకుపోయి చూసుకోవొచ్చు కదా అంటూ హేళన చేసాడు. వదిన అయితే అత్తగారు తనమీద ఏం చెప్పి వుంటారో అని గింజుకుపోయింది.
మొత్తానికి అమ్మ ముందు ...మా మధ్య పెద్ద రభసే జరిగింది.నాకది చాలా అవమానంగా అనిపించింది. ఆడదెప్పుడూ పుట్టింటికి చుట్టం చూపుగా వెళ్ళాలి తప్పించి...పుట్టిల్లే కదాని చనువు తీసుకోకూడదని తెలిసొచ్చింది.
అమ్మని విడిచి వెళ్తూ ప్రేమగా హత్తుకున్నాను.నా గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకు అంటూ తల్లిగా తల నిమిరి పంపింది అమ్మ.
అమ్మని చూడ్డం అదే ఆఖరి రోజు.నేను ఆస్ట్రేలియా వెళ్లిన పదిహేను రోజులకే తిరిగిరాని లోకానికి వెళ్ళిపోయింది అమ్మ.
అంత త్వరగా పోతుందని ఊహించనే లేదు.తిరిగి కోలుకుంటుందనే అనుకున్నాను.నేను తిరిగి ఇండియా వచ్చాకా అమ్మని నేనే చూసుకోవాలన్న తలంపుతో వున్నాను.ఏది ఏమైనా నాకు అమ్మ దూరం అయింది. అమ్మ ఉన్నప్పుడే ఆ ఇల్లు ఏంటో నాకర్థమైంది.అమ్మే లేనప్పుడు ...వెళ్ళడానికి మనస్కరించలేదు.నాలో నేనే గట్టిగా ఏడ్చాను.గుండె భారం తగ్గింది.
పెద్దోడి దగ్గర ఆరునెలలు ఉన్నాకా చిన్నోడు దగ్గరకు అమెరికా వెళ్ళాము నేనూ నా భర్తా.
ఎంతైనా పిల్లలు విదేశాల్లో ఉన్నారని వెళ్లడమే గానీ...వారంలో రెండు రోజులు మాత్రమే వాళ్ళ ముఖాలు కనిపిస్తాయి.ఇండియాలో ఉన్నప్పుడైతే కనీసం ప్రతిరోజూ ఫోన్ చేస్తూనే,వీడియో చాటింగ్ చేస్తూనే కనిపించేవారు. అదే తృప్తిగా ఉండేది. వచ్చానే గానీ నాకూ ఇండియా వెళ్లిపోవాలనే ఉంది.
కొడుకులిద్దరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారని.. అన్నయ్య ఎప్పుడూ వెటకారం చేస్తూనే ఉండేవాడు.ఇంక నాకాళ్లు భూమిమీద నిలబడవని.నేనూ ఈ దేశాన్ని వదిలేసి విదేశాలకు పోతానని.వాడి పోరుకు తగ్గట్టే నేను విదేశంలో ఉండగా అమ్మ పోవడం...నేను రాకపోవడం తో చిర్రెత్తుకుపోయాడు.
మనుషుల మర్మం తెలిసాకా నా మనసెందుకో విరిగిపోయింది.
అమ్మ పోయినప్పుడు వెళ్లలేదంటే విదేశంలో ఉండిపోవడమూ ఒక కారణమే. అన్నయ్య చెప్పినట్టు ఈసారైనా వెళ్తే అమ్మ ఆత్మకు శాంతి లభిస్తాదేమో ? నేను వెళ్లి తీరాలి.
మేము అమెరికాలో వుండటానికి నెల్లాళ్ళు గడువుంది.ఈయన మిగిలిన ఆ నెల కూడా వుండి వస్థానంటే ....అయితే నేను వెళ్తానంటూ ముందుగానే టికెట్ తీయించేసుకుని...అన్నయ్యకి ఫోన్ చేసాను.నేను ప్రయాణానికి రెడీ అయ్యానని.చెప్పగానే చాలా సంతోషించాడు. రిసీవ్ చేసుకోడానికి చెన్నై వస్తాను అన్నాడు. రానవసరం లేదని ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు.
సరే అన్నయ్యా నీ ఇష్టం అన్నాను.ఆప్యాయంగా వస్తానంటే ఎలా కాదనను?
**
చెన్నై ఎయిర్ పోర్టులో కాలు పెట్టి బయటకు వస్తుంటే ... ప్రేమగా ఎదురొచ్చి పలకరించాడు అన్నయ్య.చేతిలోని లగేజీ ట్రాలీని అందుకుంటూ ."ప్రయాణం బాగా జరిగిందా "అంటూ కుశల ప్రశ్న వేసాడు.
"హా.బాగా జరిగిందన్నయ్యా"...అన్నయ్య వాలకాన్ని చూస్తూ చెప్పాను.చూస్తుంటే బాగా చిక్కినట్టుగా వున్నాడు.ప్రతిదానికీ చిరాకు పడిపోతూ ఉంటాడు .ఆ చిరాకుల వల్లే బీపీ తో పాటూ షుగర్ కూడా చోటు చేసుకుందంట.మరి చిక్కక ఏమవుతాడు? చూస్తే జాలేసింది.
సరాసరి హోటల్ కి తీసుకెళ్లి మంచి భోజనం పెట్టించాడు.జెట్లాగ్ వల్లో ఏమో అలా నడుం వాల్చగానే నిద్రలోకి వెళ్ళిపోయాను.ఆరోజంతా అలా గడిచిపోయింది.
ఆ మర్నాడు కంచి ప్రోగ్రామ్ పెట్టాడు.సరే కదా కంచికామాక్షి అమ్మవారి దర్శన భాగ్యం వుందనుకుని వెళ్ళాము.దర్శనం అయ్యాక చీరల షాపుకి తీసుకెళ్లాడు.
" ఇప్పుడు ఇక్కడకెందుకు"?అడిగాను
"ఏం లేదు.అమ్మకి కంచిపట్టు చీరలంటే ఇష్టం కదా.నీ చేత్తో ఒక మంచి చీర నీకు నచ్చింది సెలెక్ట్ చేయి.ఆ తర్వాత అదెలాగూ నీకే ఇస్తాము గనుక" అన్నాడు.
అమ్మకని అనడంతో అడ్డు చెప్పలేకపోయాను.
అమ్మని దృష్టిలో పెట్టుకుని తన ఒంటికి బాగా నప్పే పసుపు పచ్చ చీరకి ఎర్రంచు చీర తీసాను.నన్నూ ఒకటి తీసుకోమన్నాడు గానీ నేను ఒప్పుకోలేదు.ఆ చీర ఇస్తారు కదా అంటూ తప్పుకున్నాను.తిరిగి ఆ రోజు రాత్రికి చెన్నై వచ్చేసాము.
"చెన్నైలో నీకేమైనా పనులున్నాయా" అని అడిగాడు.
"అబ్బే... ఇక్కడ నాకేం ఉంటాయి పనులు" అన్నాను.
"అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేసిపెట్టాలి"అని అనడంతో నాకు అర్థం కాలేదు.
"అదే చెల్లీ...ఈమధ్య మీ వదిన అమ్మ బట్టల బీరువా సర్దుతుంటే చీరల కింద చిన్న బ్యాగ్ లో లక్ష రూపాయలు కనిపించాయి. అవి ఎప్పటి నుంచి దాచుకుందో ఏమో ..? అవి ఖర్చు పెట్టడానికి అవి చెల్లవు. అవన్నీ పాత వెయ్యిరూపాయల నోట్లు.ఇప్పుడవి బ్యాంకులో కొత్తనోట్ల కోసం మార్పిడి చేయడానికి కూడా ఇక్కడ వాళ్ళకిచ్చిన గడువు సమయం దాటిపోయి రెండు నెలలు అయింది. ఆ పాత నోట్లను ఇప్పుడు మార్చుకోవాలంటే నీవల్లే అవుతుంది."
"అదెలా ? ఏం చేయమంటావో చెప్పు"ఆ విషయానికి విస్మయం చెంది అడిగాను.
" ఏం లేదు... ఇండియాలో ఉన్నవాళ్ళకి గడువు లేకపోయినా ...పాత నోట్లు రద్దు అయినప్పుడు ఎవరైతే విదేశాల్లో ఉన్నారో వాళ్ల కోసం గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు లో ఆ నోట్లను మార్చుకోడానికి ఈ నెలాఖరు వరకూ గడువు సమయం ఇచ్చింది." ఎలాగూ మనం చెన్నైలో ఉన్నాం కాబట్టి రిజర్వ్ బ్యాంకు కి లెటర్ ఇచ్చి మనం ఈ అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు ?"అంటూ నాకు తెలియని విషయాన్ని చెప్పాడు.
"నువ్వూ విదేశం నుంచి నిన్ననే వచ్చావన్న రుజువులు నీ దగ్గరున్నాయి.నువ్వు పాత నోట్ల రద్దైనప్పుడు ఇండియాలో లేవు గనుక ఇప్పుడు పాత నోట్లను మార్చుకోడానికి అనుమతి అడుగుతూ రిజర్వ్ బ్యాంకుకి లెటర్ రాస్తూ నీ పాస్ పోర్ట్ కాపీని జత చేసి ఇస్తే ఇంకా ఏమేమి పూరించి ఇవ్వాలో అన్నీ నేను చూసుకుంటాను " నీ అకౌంట్ లో డబ్బు జమా అయ్యాకా తిరిగి నాపేరున పంపు" అంటూ ఎంతో జాగ్రత్తగా చెప్పడావిషయం.
అన్నయ్య చెప్పినట్టుగానే...లెటర్ రాసిచ్చి..సంతకాలు చేసి ఇచ్చాను.రుజువులు అన్నీ సరిగా ఉండటంతో పని త్వరగానే అయిపోయింది.
అదే రోజు కాకినాడకు ప్రయాణమై సర్కార్ ఎక్కి కూర్చున్నాం. రైలు పరిగెడుతుంది...కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తున్నానే గానీ నా మనసు రగిలిపోతుంది....
అమ్మా నాన్నా పోయినా...నాకోసం మళ్ళీ ఇన్నాళ్లకు పరితపించే అన్నయ్య నాకంటూ వున్నాడనుకుని.... కరడు కట్టిన మనసుని కరిగించుకుని మరీ ఇంత దూరం వచ్చాను.
ఆ డబ్బు మార్పిడి కోసమే... అన్నయ్య ఆప్యాయత వెనుక ఇంత అర్థం దాగివుందన్న మాట.
ఆనాడు అమ్మకి ఆరోగ్యం బాగోలేదని వెళ్ళినప్పుడు...ఆమెకు యే లోటూ రాకూడదని అవసరానికి వాడుకోమని చెప్పి అమ్మ చేతికి లక్ష రూపాయలు ఇచ్చి వచ్చాను.వాటిని భద్రంగా బీరువాలో చీరల మాటున దాచివుంచినట్టుంది.
ఈ విషయం అన్నయ్యకి తెలియక పోవచ్చు...నేనెలా మర్చిపోగలను..???బయటకు చూస్తూ మౌనముద్ర వేసిన నాకు,చిన్నప్పుడు కథ థీం చెబుతున్న అన్నయ్యే మనసులో మెదిలాడు.
ఎపుడెపుడు దేనిపై కథ రాయాలో చెప్పిందెపుడూ అన్నయ్యే. అపుడయినా. ఇపుడయినా.
*****

